రాజకీయాలకు సోనియా గాంధీ గుడ్ బై

కాంగ్రెస్ పార్టీని రెండు దశాబ్దాలపాటు ముందుండి నడిపించిన ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఇది పార్టీకి టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు.

చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో మూడురోజులపాటు జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి హాజరైన 1500 మంది ప్రతినిధులను ఉద్దేశించి సోనియా మాట్లాడారు. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అయ్యిందన్నారు. దేశ ప్రజలు సహనం, సమానత్వం, సామరస్యం కోరుకుంటున్నారని భారత్ జోడో యాత్రద్వారా రుజువైందన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పార్టీ వచ్చే ఎన్నికలను ఎదుర్కోబోతోందని, పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

“మనమంతా క్రమశిక్షణలో పనిచేద్దాం. గతంలో ఎన్నో ఎన్నికల్లో పార్టీ గెలిచిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుందాం. రాబోయే ఎన్నికలకు సిద్ధమవుదాం. పార్టీ గెలుపు అంటే దేశానికి విజయం కాకుండా మనలో ప్రతి ఒక్కరిది అని గుర్తుంచుకుందాం.” అని సోనియా తెలిపారు.