మాఫియాను మట్టిలో కలిపేస్తాం: అసెంబ్లీలో సీఎం యోగి ఘాటు వ్యాఖ్యలు

లక్నోః బిజెపి పాలిత యూపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ పై ఆయన మండిపడ్డారు. అఖిలేష్ వైపు వేలు చూపుతూ ‘మాఫియాను మట్టిలో కలిపేస్తాం’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్యలో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్, అతడి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిని శుక్రవారం పట్టపగలు ప్రయాగ్‌రాజ్‌లో కాల్చి చంపడంపై విపక్షాలు మండిపడ్డాయి.
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ సందర్భంగా తన శైలికి భిన్నంగా వ్యవహరించారు. అఖిలేష్ యాదవ్ వైపు వేలు చూపుతూ ‘బాధితురాలి కుటుంబం ఆరోపించిన అతిక్ అహ్మద్, సమాజ్ వాదీ పార్టీ పెంచి పోషిస్తున్న మాఫియాలో భాగం కాదా?’ అని ప్రశ్నించారు. ఆ మాఫియా వెన్ను విరిచేందుకు మేం కృషి చేస్తున్నాం అని అన్నారు. అలాగే అఖిలేష్ వైపు వేలు చూపుతూ.. ‘స్పీకర్ సార్, అన్ని ప్రొఫెషనల్ క్రిమినల్స్, మాఫియాకు గాడ్ ఫాదర్ ఆయనే. వారి సిరల్లో నేరాలున్నాయి. ఈ రోజు నేను ఈ సభకు చెబుతున్నా.. ఈ మాఫియాను మట్టి కరిపిస్తా’ అని ఉద్వేగంతో యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
కాగా, సీఎం యోగి వ్యాఖ్యలతో సభలో గందరగోళం చెలరేగింది. దీంతో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సభలో మాట్లాడారు. ‘నేరస్థులు మీ వాళ్లే’ అంటూ ఎదురుదాడికి దిగారు. ‘రామరాజ్యం’లో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ‘పట్ట పగలే కాల్పులు జరుగుతున్నాయి. బాంబులు విసురుతున్నారు. సాక్షిని చంపారు. పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తోంది? డబుల్ ఇంజన్‌లు ఎక్కడ ఉన్నాయి? ఇది సినిమా షూటింగా?’ అంటూ మండిపడ్డారు.