సరిహద్దుల వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి
ఆక్రమణలు జరగనివ్వబోము

న్యూఢిల్లీ: లడాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్ద చైనా దురాక్రమణకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే భారత సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణె లేహ్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిహద్దుల వద్ద పరిస్థితి కాస్త ఉద్రిక్తంగానే ఉందని చెప్పారు. భారత ఆర్మీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోందని ఆయన అన్నారు. అందులో భాగంగానే తాము ఎల్ఏసీ వెంట బలగాలను పెంచినట్లు నరవాణె తెలిపారు. చైనా చర్యల వల్ల రెండు మూడు నెలల నుంచి ఎల్ఏసీ వెంట పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని ఆయన వివరించారు. చైనాతో నిరంతరం చర్చలు జరుపుతూనే ఉన్నామని, భవిష్యత్తులోనూ చర్చలు జరుపుతామని చెప్పారు. వాటి ద్వారా విభేదాలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉందని నరవాణె తెలిపారు. సరిహద్దుల వద్ద ఆక్రమణలు జరగనివ్వబోమని ఆయన చెప్పారు. మన దేశ సరిహద్దుల్ని కాపాడతామని తెలిపారు. తాను సరిహద్దుల వద్ద పలు ప్రాంతాల్లో పర్యటించానని చెప్పారు. అక్కడి ఆర్మీ అధికారులతో మాట్లాడానని, అక్కడ ఎటువంటి సవాళ్లు ఎదురయినా అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/