బాలాసోర్ స్టేషన్ ఇంజినీర్ అదృశ్యం..ఇంటిని సీజ్ చేసిన సీబీఐ అధికారులు

సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ను విచారించిన సీబీఐ

cbi-seals-missing-balasore-station-engineers-home-amid-odisha-train-crash-probe

బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బహానగ రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం అనంతరం కీలక అధికారి పత్తా లేకుండా పోయారు. ఈ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తు చేస్తుండడం తెలిసిందే. దర్యాప్తు బాధ్యతలు చేపట్టిన తర్వాత సీబీఐ అధికారులు ప్రాథమిక విచారణలో భాగంగా సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ను గుర్తు తెలియని ప్రాంతంలో ప్రశ్నించారు. బాలాసోర్ లో ఓ అద్దె ఇంట్లో ఇంజనీర్ కుటుంబం నివాసం ఉంటోంది.

మరోసారి బాలాసోర్ కు సీబీఐ బృందం చేరుకోగా, సదరు సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ కుటుంబంతోపాటు కనిపించకుండా పోయారు. దీంతో అతడు ఉంటున్న ఇంటిని అధికారులు సీజ్ చేశారు. రైలు కార్యకలాపాల విషయంలో సిగ్నల్ ఇంజనీర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఇన్ స్టలేషన్, నిర్వహణ, సిగ్నలింగ్ పరికరాల రిపేరింగ్, ట్రాక్ సర్క్యూట్లు, పాయింట్ మెషిన్లు, ఇంటర్ లాకింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా సిగ్నల్ ఇంజనీర్ల పర్యవేక్షణలోనే ఉంటాయి. ఈ నెల 2న జరిగిన ఘోర ప్రమాదంలో 292 మంది మరణించడం తెలిసిందే.