పెన్షన్‌ కోసం వృద్ధురాలు కాలినడక..స్పందించిన కేంద్ర మంత్రి

మానవీయ కోణంలో స్పందించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ఆదేశాలు

Sitharaman reacts as Odisha woman, 70, walks miles barefoot to collect pension

భువ‌నేశ్వ‌ర్ : ఒడిశాలో 70 ఏళ్ల వృద్ధురాలు సూర్య హరిజన్ పింఛను కోసం స్టిక్ చైర్ ను ఆధారంగా చేసుకుని మైళ్ల కొద్దీ నడిచిన ఘటన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కదిలించింది. దీనిపై ఆమె బ్యాంకు అధికారుల వివరణ కోరారు. మానవతా కోణంలో స్పందించాలని ఆదేశించారు. జారిగోన్ లోని ఎస్ బీఐ శాఖ నుంచి పింఛను తెచ్చుకునేందుకు ఆమె ఇంత కష్టం పడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో పెద్ద వైరల్ గా మారింది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వీడియోని చూసి ట్విట్టర్ లో స్పందించారు. దీన్ని చూసి మానవీయంగా స్పందించాలని ఆమె ఎస్ బీఐ అధికారులను కోరారు. ఆమె నివసించే ప్రాంతంలో బ్యాంక్ మిత్ర లేరా? అని ప్రశ్నించారు. మంత్రివర్యుల ఆదేశాలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు ఆఘమేఘాల మీద స్పందించారు.

‘‘మేడమ్ మేము కూడా ఈ వీడియోని చూసి అంతే బాధపడ్డాం. ఈ వీడియోలోని శ్రీమతి సూర్య హరిజన్ ప్రతి నెలా తన గ్రామంలోని సీఎస్ పీ పాయింట్ వద్ద వృద్ధాప్య ఫించను తీసుకునే వారు. వయసు పెద్దది కావడంతో ఆమె వేలి ముద్రలు సీఎస్ పీ పాయింట్ డేటాతో సరిపోలడం లేదు. దీంతో ఆమె తన బంధువును వెంట బెట్టుకుని జారిగోన్ లోని బ్రాంచ్ ను సంప్రదించారు. బ్రాంచ్ మేనేజర్ వెంటనే ఆమె ఖాతా నుంచి డెబిట్ చేసి ఆమెకు చెల్లింపులు చేశారు. వచ్చే నెలా నుంచి ఇంటి వద్దే పింఛను ఇస్తామని చెప్పారు. సూర్య హరిజన్ కు బ్యాంకు తరఫును ఉచితంగా ఓ వీల్ చెయిర్ ఇవ్వాలని నిర్ణయించాం’’అంటూ ఎస్ బీఐ అధికారులు స్పందించారు.