తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందిః మంత్రి గంగుల

సిఎం కెసిఆర్ ఆదేశాలతో చురుగ్గా ధాన్యం సేకరణ.. మంత్రి గంగుల

TS Minister Gangula Kamalakar
TS Minister Gangula Kamalakar

కరీంనగర్‌ః పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఈరోజు కరీంనగర్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణకు పౌరసరఫరాల శాఖ సర్వం సిద్ధం చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటివరకూ 1131 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, 90వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని అధికారులు వివరించారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు యాసంగి ధాన్యం సేకరణ చురుగ్గా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. రైతు అనుకూల విధానాలు, రైతుబంధు, రైతుబీమా , 24గంటల ఉచితకరెంటు, కాళేశ్వరం జలాలతో పంట విస్తీర్ణం ఏటా పెరుగుతూ రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరిస్తున్నామన్నారు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైతు పండించిన చివరిగింజను మద్దతు ధరతో కొనాలన్న సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు.

ప్రపంచవ్యాప్త నివేదికల్లో ఓవైపు యావత్ ప్రపంచంలో 20ఏళ్ల కనిష్టానికి బియ్యం ఉత్పత్తి పడిపోతుంటే, కేవలం తెలంగాణలో మాత్రమే బియ్యం ఉత్పత్తి ఆరింతలు పెరిగిందన్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వం, సీఎం కెసిఆర్ సాధించిన ఘనత అని మంత్రి పేర్కొన్నారు. అత్యధికంగా నల్గొండ, నిజామాబాద్‌లో ధాన్యం కొనుగోలు కొనసాగుతుందన్నారు . లక్ష్యం మేరకు సేకరణకు అవసరమైన 7031 పైచీలుకు కొనుగోలు కేంద్రాలు, గన్నీ బ్యాగులు, మాయిశ్చర్ మిషన్లు, వేయింగ్ మిషన్లు, హమాలీలను సమకూర్చుకున్నామని, అకాల వర్షాల నేపథ్యంలో టార్పలిన్లను సైతం అందుబాటులో ఉంచామన్నారు. ఈ సమీక్షలో సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్, పౌరసరఫరాల సంస్థ జిఎం రాజారెడ్డి, కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా డీసీఎస్‌ఓ డీఎం ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.