నేడు ప్రజా పాలన గ్యారెంటీ నమూనా దరఖాస్తును విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

రెండే పేజీలతో 5 గ్యారెంటీలకు ఒకే దరఖాస్తు..

CM Revanth Reddy

హైదరాబాద్‌ః ఎన్నికల హామీలు అమలు చేయడంపై దృష్టిసారించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఒక్కో గ్యారెంటీకి వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ‘‘ప్రజా పాలన గ్యారెంటీ దరఖాస్తు’ను విడుదల చేయనుంది. సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. సామాన్య ప్రజలు సులభంగా అర్థం చేసుకొని ఐదు నిమిషాల్లో నింపేలా 2 పేజీలతో ఈ దరఖాస్తును సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులకు ఈ ప్రొఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దరఖాస్తు మొదటి పేజీలో ఎడమవైపు తెలంగాణ రాష్ట్ర చిహ్నంతో పాటు సీఎం రేవంత్‌ రెడ్డి ఫొటోను ముద్రించారు. ఇక కుడివైపు అభయహస్తం సింబల్‌, డిప్యూటీ సీఎం భట్టి ఫొటోలను ప్రింట్ చేశారు.

రెండు పేజీల దరఖాస్తులో మొదటి పేజీలో దరఖాస్తుదారుల వివరాలు, చిరునామా ఉంటాయి. ఆధార్ ప్రకారం దరఖాస్తుదారుని పేరు, తండ్రి/భర్త పేరు, స్త్రీ/పురుషుడు, కులం, పుట్టిన తేదీ (ఆధార్‌ ప్రకారం), ఆధార్‌ కార్డు నంబరు, మొబైల్‌ నంబరు, రేషన్‌కార్డు నంబరు, చిరునామా వివరాలను తెలియజేయాలి. ఇక రెండో పేజీలో పథకాలకు సంబంధించిన వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అభయ హస్తం గ్యారెంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలను నింపాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ప్రతినెలా రూ. 2,500 ఆర్థిక సాయం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌, గృహజ్యోతి పథకంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత (దివ్యాంగులకు రూ. 6 వేలు, ఇతరులకు రూ. 4 వేలు) గ్యారంటీలను పొందేందుకు ఒకే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గురువారం (రేపటి) నుంచి జనవరి ఆరో తేదీ వరకు ప్రజాపాలన సదస్సులో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంటింటికీ దరఖాస్తులు అందజేయనున్నారు. ఏ రోజు రావాలో కూడా అధికారులు క్లియర్‌గా చెప్పనున్నారు. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే లబ్ధిదారులైతే దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు. మరోవైపు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ఫిర్యాదులు వస్తే రీ-వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.