ప్రముఖ గాయకుడు కేకే హఠాన్మరణం

ఆడిటోరియంలో కాన్సర్ట్ అనంతరం అస్వస్థతకు గురైన కేకే

కోల్‌కతా : బాలీవుడ్ ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాథ్ హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. కేకేగా చిరపరిచితమైన ఆయన కోల్‌కతాలోని నజురుల్ మంచా ఆడిటోరియంలో ప్రదర్శన ఇచ్చారు. అనంతరం ఆయన అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆయనను సీఎంఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు కేకే మరణించినట్టు ధ్రువీకరించారు.

1990లలో ‘పాల్’, ‘యారోన్’ సినిమాల్లో ఆయన పాడిన పాటలు సంచలనం సృష్టించాయి. యువతలో ఆయన పాటలకు విపరీతమైన క్రేజ్ ఉండేది. స్కూల్, కాలేజీ, కల్చరల్ ఈవెంట్స్‌లో ఎక్కువగా ఈ పాటలు వినిపించేవి. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ సహా పలు భాషల్లోనూ పాటలు పాడారు.

కేకే మరణవార్త ఆయన అభిమానులను, ప్రముఖులు, సన్నిహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. కేకే మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన పాటలు అన్ని రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని, అన్ని వయసుల వారిని అలరిస్తాయని అన్నారు. ఆయన పాటల ద్వారా ఎప్పటికీ కేకేను గుర్తుంచుకుంటామని అన్నారు. కేకే కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కేకే తెలుగులో సూపర్‌ హిట్స్‌ సాంగ్స్‌

కృష్ణకుమార్‌ కున్నత్‌ ఏఆర్‌ రెహమాన్‌ సంగీత దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ప్రేమ దేశం చిత్రంలో ప్లేబ్యాక్‌ సింగర్‌గా పరిచయమయ్యాడు. ఈ చిత్రంలో కాలేజీ స్టైలే, హలో డాక్టర్‌ పాటలు ఆలపించగా.. రెండు సూపర్‌ హిటయ్యాయి. ఇంద్రా, సంతోషం, ఘర్షణ, గుడుంబా శంకర్‌, నువ్వేనువ్వే, సైనికుడుతో పాటు పలు చిత్రాల్లో పాటలు పాడారు. ఇద్రా చిత్రంలో ‘దాయి దాయి దామ్మా’, నేనున్నాను చిత్రంలో ‘ఐ ఆమ్‌ వెరీ సారీ’, ఘర్షణలో ‘చెలియ చెలియ’, వాసులో ‘పాటకు ప్రాణం’, ఖుషిలో ‘యే మేరా జహ’, నువ్వునేను చిత్రంలో ‘నీకోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ ఆలాపన’, నా ఆటోగ్రాఫ్‌ చిత్రంలో ‘గుర్తుకొస్తున్నాయి’, ఆర్యలో ‘ఫీల్‌ మై లవ్‌’, ‘జల్సా’లో మై హార్ట్‌’, లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ప్రేమకావాలి’లో ‘మనసంతా ముక్కలు చేసి’ తదితర ఎన్నో తెలుగు హిట్‌ పాటలను కేకే ఆలపించారు. ఆయన మృతికి పలువురు తెలుగు సంగీత దర్శకులు సంతాపం ప్రకటించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/