అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం..కేంద్రమంత్రులకు ప్రధాని కీలక సూచనలు

`Show aastha, not aggression`, says PM Modi to BJP leaders ahead of Ram temple Pran Pratishtha

న్యూఢిల్లీః ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. జనవరి 22వ తేదీ అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వేడుక జరగనుంది. ఈ వేడుకకు అతిరథమహారథులు, రామయ్య భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఈ మేరకు అయోధ్యను అధికారులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. అయోధ్య రాముడి ఆలయ ప్రారంభోత్సవం వేళ కేంద్ర మంత్రులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక సూచనలు చేసినట్లు సమాచారం. గత కేబినెట్‌ సమావేశంలో ఈ ప్రస్తావన వచ్చిందని, ఈ సందర్భంగా మోడీ మంత్రులకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేళ మంత్రులంతా విధేయతా, భక్తిభావంతో మసులుకోవాలని, దుందుడుకు ప్రవర్తనకు దూరంగా సంయమనంతో వ్యవహరించాలని మోడీ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం వేళ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ గౌరవం ఇనుమడింపజేసేలా నడుచుకోవాలని సూచించినట్లు తెలిసింది. తమ నియోజకవర్గాల్లో సామరస్యపూరిత వాతావరణానికి విఘాతం కలగకుండా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం.