యాదాద్రిని దర్శించుకున్న ఏపీ మంత్రి బొత్స

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మంగళవారం యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. ప్ర‌ధాన ఆల‌యంలో స్వ‌యంభూ పంచ‌నార‌సింహుడిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ప్రాకారంలోని అద్దాల మండపంలో ఆయనకు వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు. త‌మ‌ కుమారుడి వివాహం త‌ర్వాత‌ తిరుపతి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దర్శనానికి వెళ్లానని, ఆ తరువాత త‌మ‌ ఇష్ట దైవమైన యాదగిరిగుట్టకు వచ్చినట్లు తెలిపారు.

ఏడేండ్ల త‌ర్వాత యాదాద్రి ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి వారి ఆశీస్సుల కోసం వ‌చ్చిన‌ట్లు బొత్స చెప్పారు. అంత‌కుముందు 2015లో ద‌ర్శించుకున్నాన‌ని వెల్ల‌డించారు. నాటికీ నేటికీ యాదాద్రి ఆల‌య రూపురేఖ‌లు మారిపోయాయ‌న్నారు. త‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని స్వామి వారిని వేడుకున్న‌ట్లు తెలిపారు. యాదాద్రి దేవ‌స్థానాన్ని ముఖ్యమంత్రి మ‌హాద్భుతంగా తీర్చి దిద్దార‌ని..బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.