హైదరాబాద్‌లో కొత్త యూఎస్ కాన్సులేట్ ప్రారంభం

హైదరాబాద్ వేదికగా నానాక్‌రాంగూడలో ఏర్పాటు చేసిన నూతన అమెరికన్ కాన్సులేట్ భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. అమెరికా స్వాతంత్య్ర 247వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని కొత్త యూఎస్ కాన్సులేట్‌ను భారత్‌లోని యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు. రాయబారి గార్సెట్టితో పాటు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ – అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత పటిష్ఠం కావాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
340 మిలియన్‌డాలర్లతో ఏర్పాటు చేసిన నూతన కాన్సులేట్ భవనం భారత్, అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఈ సందర్భంగా ఎరిక్ గార్సెట్టి తెలిపారు.
‘అమెరికా 247వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. నా దృష్టిలో ఇది కాన్సులేట్ కార్యాలయం కాదు… సహృదయం నిండిన నిలయం. తెలుగు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భాష’ అని రాయబారి చెప్పుకొచ్చారు.