గులాం నబీ ఆజాద్ కు భారీ షాక్ ఇచ్చిన సొంత నేతలు

సీనియర్ రాజకీయ నేత గులాం నబీ ఆజాద్..కాంగ్రెస్ పార్టీ ని వీడి..సొంతంగా ‘డెమొక్రటిక్​ ఆజాద్ పార్టీ’ పేరుతో ఓ రాజకీయ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. ఆజాద్ పార్టీ పెట్టడం తో చాలామంది కాంగ్రెస్ నేతలు సొంత పార్టీని వీడి ఆజాద్ పార్టీ లో చేరారు. ఇక ఇప్పుడు ఆజాద్ ను వద్దనుకుని , తిరిగి సొంత గూటికే వచ్చేసారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 17 మంది తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర.. ఈ నెల 20న జమ్ముకశ్మీర్​కు చేరనుంది. దానికి ముందుగా వారంతా సొంత గూటికి రావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ అన్నారు.

జమ్ముకశ్మీర్​ మాజీ ఉపముఖ్యమంత్రి తారా చంద్​, మాజీ పీసీసీ చీఫ్​ పీర్జాదా మహమ్మద్​ సయ్యద్​, మాజీ ఎమ్మెల్యే బల్వంత్​ సింగ్​ సహా 17 మంది నాయకులు శుక్రవారం దిల్లీ చేరుకుని కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. గాంధీ కుటుంబంతో కశ్మీర్​ ప్రజలకు ప్రత్యేక సంబంధాలు ఉన్నాయని వారు అన్నారు. భావోద్వేగాలు, స్నేహం కారణంగా హడావుడిగా పార్టీని వీడి తప్పు చేశామని వారు పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.