ఈరోజు నుండి షర్మిల ఎన్నికల ప్రచారం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీసీసీ చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. YSR(D) బద్వేల్లోని ఆమగంపల్లి నుంచి బస్సుయాత్ర ప్రారంభించనుండగా.. కలసపాడు, పోరుమామిళ్ల, బి. కోడూరు, బద్వేల్, అట్లూరులో యాత్ర సాగనుంది. 6న కడప, 7న మైదుకూరు, 8న కమలాపురం, 10న పులివెందుల, 11న జమ్మలమడుగు, 12న ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు.

షర్మిలతో పాటు సునీత కూడా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్సుంది. మొదటి రోజైన నేడు బద్వేల్ నియోజకవర్గంలోని 7 మండలాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచారంలో చిన్నాన్న వైఎస్ వివేకా హత్యను అస్త్రంగా షర్మిల చేసుకుంటారని టాక్. అలాగే ఆమె మెయిన్ టార్గెట్ సీఎం జగన్, వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డిలు కావడంతో ఆమె ప్రసంగం ఎలా ఉండబోతోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

గురువారం ఎక్స్‌ వేదికగా తాను ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘దేవుడి దీవెనలతో, నాన్న ఆశీర్వాదంతో, అమ్మ ప్రేమతో, చిన్నాన్న చివరి కోరిక ప్రకారం ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతున్నాను. మీ రాజన్న బిడ్డను దీవించాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ యుద్ధంలో మీ ఆశీస్సులు నాపై ఉంటాయని ఆశిస్తున్నా’ అని షర్మిల పేర్కొన్నారు.