ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం

President Murmu addresses the Parliament ahead of the Budget Session

న్యూఢిల్లీః పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పార్లమెంటుకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ స్వాగతం పలికారు. పార్లమెంటు నూతన భవనంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. కొత్త పార్లమెంటులో నా తొలి ప్రసంగం అంటూ ముర్ము తన ప్రసంగాన్ని ప్రారంభించారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైందని అన్నారు. శాంతినికేతన్‌ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు. భగవాన్‌ బిర్సాముండా జన్మదినాన్ని జన్‌ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నామని తెలిపారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం అని వ్యాఖ్యానించారు.

“చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్‌ రికార్డు సృష్టించింది. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను భారత్‌ దిగ్విజయంగా ప్రయోగించింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్‌-1 ప్రవేశించింది. జీ20 సమావేశాలను భారత్‌ విజయవంతంగా నిర్వహించింది. ఆసియా పారా క్రీడల్లో భారత్‌ 111 పతకాలు సాధించింది. భారత్‌లో తొలిసారిగా నమో భారత్‌ రైలును ఆవిష్కరించాం.” అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో వెల్లడించారు.

నారీశక్తి వందన్‌ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించామని తెలిపారు. పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా భారత్‌ ముందుకెళ్తోందని చెప్పారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీకి శంకుస్థాపన చేశామని వెల్లడించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించి.. అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించుకున్నామని వివరించారు. ఎన్నో ఏళ్ల భారతీయుల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు.

“దేశంలో 5జీ నెట్‌వర్క్‌ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో కొత్త క్రిమినల్‌ చట్టాన్ని తీసుకొచ్చాం. ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌తో ముందుకెళ్తున్నాం. రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. మన చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నాం. ప్రస్తుతం దేశంలో పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్‌ వ్యవస్థల్లో భారత్‌ ఒకటి. ఆత్మనిర్భర భారత్‌, మేకిన్‌ ఇండియా మన బలాలుగా మారాయి” అని రాష్ట్రపతి అన్నారు.

YouTube video