ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం అర్ధరాత్రి పెళ్లి వారితో వెళుతున్న ఓ బస్సు సాగర్ కాలువలో పడిపోయింది. పొదిలి నుంచి కాకినాడకు వెళుతుండగా దర్శికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు ఒంగోలు రిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఏడేళ్ల చిన్నారి కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. చిన్నారి మృతదేహం బస్సు కింద చిక్కుకుపోయినట్టు గుర్తించారు. పొదిలి నుంచి కాకినాడకు వివాహ రిసెప్షన్ కోసం వెళుతుండగా డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా బస్సు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది. వీరంతా పొదిలిలో సోమవారం జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరై కాకినాడలో రిసెప్షన్ కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులో బయలుదేరింది పెళ్లి బృందం.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో బోల్తా పడిన బస్సును బయటకు తీశారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నట్టుగా తెలిసింది. బస్సు కింద నీళ్లలో చిక్కుకున్న ఏడేళ్ల పాప షేక్ హీనా మృతదేహం లభించింది. అతి కష్టం మీద పాప మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు. మృతుల్లో పెళ్లికూతురు మేనత్తలు ఇద్దరు, అమ్మమ్మ, మేనత్త కోడలు ఉన్నట్టు తెలిసింది. పొదిలి పెద్ద మసీదు హాఫీజ్ సాబ్ అబ్దుల్ అజీజ్ , ఆయన భార్య, మనవరాలు ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రమాదం ఫై సీఎం జగన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.