ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఉన్నతాధికారుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో కేంద్రానికే నియంత్రణ ఉండేలా తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని కోరింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపింది.

కేంద్రం ఆర్డినెన్స్‌ రాజ్యాంగ విరుద్ధమని, దాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని ఢిల్లీ ప్రభుత్వం పిటిషన్‌లో కోరింది. ఆర్డినెన్స్‌ను రద్దు చేయడంతో పాటు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఆప్‌ సర్కారు తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్‌లోని ఆర్డినెన్స్‌లోని సెక్షన్ 45కే వంటి తదితర నిబంధనలను కోర్టు ముందు ప్రస్తావించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఎక్కువ అధికారాలు ఇస్తున్నారని, ఆర్డినెన్స్‌ సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. ఆర్డినెన్స్‌పై స్టే ఇవ్వాలని కోరగా.. ధర్మాసనం విముఖత వ్యక్తం చేసింది. విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. చట్టబద్ధమైన సంస్థలు, కమిషన్లు, బోర్డులు, అధికారులపై కేంద్రానికి నియంత్రణను ఇచ్చే ఆర్డినెన్స్ సెక్షన్ 45డీ చెల్లుబాటును కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం సవాల్‌ చేసింది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పాటు క్యాబినెట్ మంత్రులు రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును కేంద్రం ప్రవేశపెడితే చట్టాన్ని అడ్డుకునేందుకు వివిధ రాజకీయ పార్టీల మద్దతు కోరుతున్నారు. ఐఏఎస్‌ సర్వీస్‌ అధికారులతో సహా ఉన్నతాధికారుల నియామకం, బదిలీలు, పోస్టింగులకు ఢిల్లీ ప్రభుత్వానికే కార్యనిర్వహఖ అధికారం ఉందని గత మేలో సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ‘నేషనల్ క్యాపిటల్ సర్వీస్ అథారిటీ’ పేరుతో ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. ఇందులో కమిటీ ఏర్పాటు చేయనుండగా.. ఢిల్లీ ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. కమిటీలో ముగ్గురు సభ్యులున్నా.. ఎల్‌జీ నిర్ణయమే తుది నిర్ణయమని ఆర్డినెన్స్‌లో స్పష్టం చేసింది.