ఎమ్మెల్యే రఘునందన్ రావు పై రూ. 1,000 కోట్ల పరువు నష్టం దావా

ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై నిరాధార ఆరోపణలు చేశారన్న ఐఆర్బీ ఇన్ఫ్రా

irb-infra-sends-defamation-notice-to-raghunandan-rao

హైదరాబాద్‌ః బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై ప్రముఖ రియలెస్టేట్ కంపెనీ ఐఆర్బీ ఇన్ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ రూ. 1,000 కోట్ల పరువునష్టం దావా వేసింది. ఈ మేరకు ఆయనకు నోటీసులు పంపింది. నోటీసుల్లో ఐఆర్బీ పేర్కొన్న వివరాల ప్రకారం… ఈ నెల 25న రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ ఉద్యమం చేసే వారిని ఐఆర్బీ చంపేస్తుందని అన్నారని తెలిపింది. గతంలో జరిగిన ఆర్టీఏ కార్యకర్త హత్యతో ఐఆర్బీకి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని పూణే సెషన్స్ కోర్టు, ముంబయి హైకోర్టు కూడా స్పష్టం చేశాయని పేర్కొంది. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా తమ ప్రతిష్ఠను దెబ్బతీసేలా రఘునందన్ రావు మాట్లాడారని విమర్శించింది.

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లీజుకు సంబంధించి తమపై నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపింది. పలు జాతీయ ప్రాజెక్టుల్లో తమ సంస్థ భాగస్వామిగా ఉందని చెప్పింది. తమను ఎక్కడా బ్లాక్ లిస్టులో పెట్టలేదని, రాజకీయ ప్రయోజనాల కోసం తమపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపింది. తమకు రఘునందన్ రావు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కోరింది. క్షమాపణలు చెప్పకపోతే రూ. 1,000 కోట్లు పరువు నష్టం కింద చెల్లించాలని లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.