ఫిబ్రవరి లో సికింద్రాబాద్-చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం

South India’s first Vande Bharat Express trial run between Chennai-Mysore begins

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వందే భారత్ రైలు పరుగులు పెడుతుండగా..ఇప్పుడు మరో రైలు పరుగులు పెట్టేందుకు సిద్దమవుతుంది. వచ్చే నెలలో సికింద్రాబాద్-చెన్నైల మధ్య వందే భారత్ రైలు ప్రారంభం కాబోతుంది. ఇటీవలే సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ – వైజాగ్ ల మధ్య వందే భారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు ఉపయోగపడే రీతిలో మరో వందేభారత్ రైలును కేటాయించింది. సికింద్రాబాద్ నుంచి చెన్నైకి వచ్చే నెలలో వందేభారత్ రైలును ప్రారంభించనుంది.

ఈ నేపథ్యంలో అధికారులు ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ లో ఈ రైలు చెన్నైలో బయల్దేరి గూడూరుకు రాత్రి 2 గంటలకు చేరుకుంది. అక్కడ్నించి బయల్దేరి ఒంగోలుకు ఉదయం 5.20 గంటలకు చేరుకుంది. చీరాలకు ఉదయం 6.25 గంటలకు, విజయవాడకు 8.25 గంటలకు చేరుకుంది. త్వరలోనే ఈ రైలు ప్రారంభం ఫై అధికారిక తేదీ రానుంది.

ఇదిలా ఉంటె త్వరలో మినీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లను పెంచడం, జలంధర్‌తో లూథియానా లేదా కోయంబత్తూర్ వంటి టైర్-టూ నగరాలను మధురైతో అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో 8 కోచ్‌లతో మినీ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడిపేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. త్వరలో వాటిని పట్టాలెక్కించాలని కేంద్రం నిర్ణయించింది. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో దీని కోసం ఒక నమూనా తయారు చేస్తోంది. సీటింగ్ అమరికతో కూడిన మినీ-వందే భారత్ ఎక్స్‌ప్రెస్ డిజైన్ దాదాపుగా ఫైనల్ అయినందున అటువంటి ఎనిమిది కోచ్‌ల వందే భారత్ ఈ ఏడాది మార్చి-చివరిలో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.