సికింద్రాబాద్ బిఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థిగా పద్మారావు గౌడ్

padmarao

హైదరాబాద్‌ః సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పేరును బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్యనేతలతో జరిగిన సమావేశంలోచర్చించి అందరి అభిప్రాయం సేకరించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిఆర్ఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ సీనియర్ నేతగా నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు పార్టీకి విధేయుడుగా ఉన్న పద్మారావు గౌడ్ అందరివాడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొంది.

సికింద్రాబాద్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన నిబద్ధత కలిగిన స్థానిక నేతగా ఆ ప్రాంత ప్రజలు బస్తీవాసులందరికీ పజ్జన్నగా ఆదరాభిమానాలు పొందిన పద్మారావు గౌడ్‌ను సరియైన అభ్యర్థిగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపింది. అందరి ఏకాభిప్రాయం మేరకు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌ను బరిలోకి దింపాలని బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.