పాదయాత్రలో కల్లు తాగిన వైఎస్ షర్మిల

YS Sharmila who drank Kallu during the padayatra

పాలకుర్తిః పాలకుర్తి మండలం శాతపురం నుంచి వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర సాగుతోంది. తొర్రూర్, లక్ష్మినారాయణపురం మీదుగా మధ్యాహ్నం పాలకుర్తి చౌరస్తాకు చేరుకోనుంది షర్మిల పాదయాత్ర. ఓటుకు నోటులో దొరికిన దొంగ రేవంత్‌ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు షర్మిల. రేవంత్‌రెడ్డి పిలక కేసీఆర్‌ చేతిలో ఉందన్న షర్మిల రేవంత్‌ది పాదయాత్ర కాదు.. కార్‌ యాత్ర అన్నారు. ఆ విషయం సొంత పార్టీ నేతలే చెబుతున్నారని రేవంత్‌ రెడ్డిని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌కి అమ్ముడుపోయిన కాంగ్రెస్‌కు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, పోటాపోటీగా కొనసాగుతున్న యాత్ర నేపథ్యంలో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పాలకుర్తిలో భారీగా బలగాలను దించేశారు. ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెంచారు. 8 డ్రోన్ కెమెరాలు, 350 మంది పోలీసులతో బందోబస్తు మధ్య కొనసాగుతున్నాయి షర్మిల, రేవంత్‌ రెడ్డి పాదయాత్రలు.

మరోవైపు వైఎస్‌ షర్మిల పాలకుర్తి పాదయాత్రలో కల్లు తాగడం ఆసక్తికరంగా మారింది. లక్ష్మీనారాయణ పురం స్టేజి దగ్గర కల్లు గీత కార్మికుడి కోరిక మేరకు తాటికల్లు నీరా రుచి చూశారు షర్మిల. కల్లు తాగడం తనకు అలవాటు లేదని, కానీ గీత కార్మికుడు కోరిక మేరకు కొద్దిగా రుచి చూసినట్లు షర్మిల తెలిపారు. వారి సమస్యలు విన్న అనంతరం.. YSR తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే కల్లు గీత కార్మికులకు పెద్ద పీట వేస్తామని హామీ ఇచ్చారు.