రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

second-day-of-telangana-assembly-budget-session-started

హైదరాబాద్ః రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభయ్యాయి. నేడు గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలో చర్చ జరుగనుంది. ఇందులో భాగంగా శాసనసభలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, శాసనమండలిలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టారు. మండలిలో రెండో తీర్మానాన్ని ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌, శాసనసభలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రవేశపెట్టనున్నారు. అనంతరం టేబుల్‌ ఐటమ్స్‌గా మంత్రులు వార్షిక నివేదికలను సభలకు సమర్పించనున్నారు. రాష్ట్ర ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన 1వ, 2వ, 3వ వార్షిక నివేదికలను పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ సభకు అందజేయనున్నారు.

రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు సంబంధిందిన 4వ వార్షిక నివేదిక, తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ వార్షిక నివేదికను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ఫుడ్స్‌ నివేదికలను పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల, మైనార్టీ సంక్షేమానికి సంబంధించి వక్ఫ్‌బోర్డుకు జీవో 43ని మైనారిటీ, షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సభ ముందు ఉంచనున్నారు. ఇవే నివేదికలను మంత్రులు శాసనమండలిలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాలను ఉభయ సభల్లో సమర్పించనున్నారు.