మాజీ ఎంపీ వినోద్ కుమార్ హోటల్లో సోదాలు

Searches at former MP Vinod Kumar’s hotel

హైదరాబాద్‌ః బిఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు చెందిన హోటల్ లో పోలీసులు సోదాలు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమా మల్టిప్లెక్స్ లో శనివారం ఉదయం వరకు కొనసాగిన ఈ సోదాల్లో భారీ మొత్తంలో నగదు బయటపడ్డట్లు అధికారులు వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల హడావుడి నేపథ్యంలో తాజా రెయిడ్స్ సంచలనంగా మారాయి. పోలీసుల తనిఖీలలో రూ.6.65 కోట్ల విలువైన నోట్లకట్టలు బయటపడ్డట్లు సమాచారం. ఈ నగదును సీజ్ చేసిన పోలీసులు.. దీనిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని తెలిపారు. ఈ డబ్బు ఎవరిదనే దానిపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

హోటల్ కేంద్రంగా భారీగా డబ్బులు తరలిస్తున్నారనే ముందస్తు సమాచారంతో పోలీసులు పకడ్బందీగా దాడులు చేసినట్లు సమాచారం. ఎన్నికల వేళ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు పంచేందుకే ఈ సొమ్ము తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల వ్యవహారాలన్నీ ఈ హోటల్ కేంద్రంగానే జరుగుతున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. ఈ హోటల్ బిఆర్ఎస్ పార్టీ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులదే కావడం గమనార్హం.