రేపు స్కూళ్లకు సెలవు..
సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రేపు (ఫిబ్రవరి 23న) ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. అన్ని రకాల స్కూళ్లు, కాలేజీలకు ఈ సెలవు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇక మేడారం జాతర నిన్నటి నుండి మొదలైంది. నాల్గు రోజుల పాటు జరగనున్న ఈ జాతర కు అనేక రాష్ట్రాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. మేడారానికి వస్తున్న భక్తులు మొదట జంపన్న వాగు వద్దకు చేరుకుంటున్నారు.
కళ్యాణ కట్ట వద్ద తలనీలాలు సమర్పించి స్నానాలు ఆచరిస్తున్నారు. జంపన్నవాగు పొడుగునా ఎటుచూసినా జనాలే కనిపిస్తున్నారు. పుణ్యస్నానాల అనంతరం అక్కడి నుంచి అమ్మవార్ల దర్శనానికి తరలివెళ్తున్నారు. మరికాసేపట్లో మేడారం గద్దెపైకి సారలమ్మ రానున్నారు. కన్నేపల్లి నుంచి భారీ బందోబస్తు మధ్య సారలమ్మ మేడారం గద్దె మీదకు చేరనున్నారు. సారలమ్మతో పాటే గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజు కొలువుదీరనున్నారు.
మరోపక్క సీఎం రేవంత్ సైతం రేపు మేడారం కు వెళ్లనున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్నారు. తొలిసారి సీఎం హోదాలో వనదేవతలను దర్శించుకోనున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా ఇదే రోజు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా జాతరకు వెళ్లనున్నారు.