ఏటీఎం కార్డు లేకుండా ఏటీఎంల నుండి డబ్బు డ్రా చేసుకోవచ్చు ..ఎలా అంటే..!

ఎటిఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఎటిఎం కార్డు పెట్టాల్సిందే..కానీ ఇక నుండి కార్డు పెట్టకున్న డబ్బులు డ్రా చేసుకోవచ్చు. భారత్ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు నూతన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో కార్డు లేకుండానే ఏటీఎం నుంచి క్యాష్ తీసుకునే సౌకర్యాన్ని కలిపిస్తుంది. ఎస్బీఐ ఖాతాదారులు కార్డు లేకుండానే నగదును తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటిదాకా ఇటువంటి సదుపాయం కేవలం ఎస్బీఐ (SBI)ఏటీఎం లలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఎస్బీఐ కొత్తగా అందించే సదుపాయంలో భాగంగా ఇక అన్ని ఏటీఎంలకు దీన్ని విస్తరిస్తూ బ్యాంక్‌ యాప్‌ ‘యోనో’(YONO)ను అప్‌గ్రేడ్‌ చేసింది.

ఎస్బీఐ 68వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సరికొత్త అప్ డేట్ ని తీసుకొచ్చింది. ఎస్బీఐ ఖాతాదారులే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా ఈ యాప్ ద్వారా ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చునని ఎస్బీఐ తెలిపింది. ఎస్బీఐ ఇంటర్ ఆపరేబుల్ కార్డు లెస్ క్యాష్ విత్ డ్రాయల్ సర్వీస్ ద్వారా ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు. దీంతో పాటు లావాదేవీలు, షాపింగ్ లు, ఇతర చెల్లింపులు వంటి యూపీఐ కార్యకలాపాలు యోనో యాప్ లో చేసుకోవచ్చునని ఎస్బీఐ ప్రకటించింది.

స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సర్వీసులు ఇందులో అందుబాటులో ఉంటాయి. అలానే ఎవరికైనా డబ్బు యూపీఐ ద్వారా పంపించవచ్చు. ఎవరినైనా ఈ యాప్ ద్వారా డబ్బు కావాలని రిక్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. అయితే యూపీఐ పేమెంట్స్ కోసం ప్లాట్ ఫామ్ ఫీజు కింద సర్వీస్ ఛార్జీ ఎంత వసూలు చేస్తుందో అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.