చైనాలో పర్యటించే అమెరికన్లకు బైడెన్ హెచ్చరిక

ఆ దేశంలో డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు..నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలకు దూరంగా ఉండాలి..

us-warns-citizens-against-china-travel-amid-risk-of-wrongful-detention

వాషింగ్టన్‌ః చైనాలో పర్యటించాలనుకునే అమెరికన్లు పునరాలోచించుకోవాలని బైడెన్ సర్కారు కోరింది. డ్రాగన్ కంట్రీలో ఉన్నపుడు తప్పుడు ఆరోపణలతో పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈమేరకు తన పౌరుల కోసం అమెరికా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. తమ ప్రభుత్వాన్ని కానీ స్థానిక యంత్రాంగాన్ని కానీ విమర్శించే విదేశీయులను అరెస్టు చేస్తోందని, దేశం నుంచి వెళ్లిపోకుండా ఎగ్జిట్ బ్యాన్ విధిస్తోందని తెలిపింది. అరెస్టు చేసే సమయంలో కనీసం నేరారోపణలను కూడా వెల్లడించడంలేదని వివరించింది. ఈమేరకు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రభుత్వం ఆర్బిట్రరీ చట్టాలను కఠినంగా అమలు చేస్తోందని అమెరికా తన అడ్వైజరీలో పేర్కొంది. ఇటీవల అమెరికన్ పౌరుడికి చైనా కోర్టు జీవితఖైదు విధించిన ఉదంతాన్ని ఇందులో ప్రస్తావించింది.

చైనా వెళ్లేముందు కానీ, చైనాలో ఉన్నపుడు కానీ డ్రగ్స్ తీసుకోవద్దని, చైనాలో జరిగే నిరసన ప్రదర్శనలలో పాల్గొనవద్దని అమెరికా తన పౌరులను హెచ్చరించింది. చైనాతో పాటు హాంగ్ కాంగ్, మకావూలలో పర్యటించే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అమెరికా గతంలోనూ చైనా పర్యటనకు వెళ్లే తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, కొవిడ్ కారణంగా సడెన్ గా విధించే లాక్ డౌన్ ల గురించి, దీనివల్ల అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందనే సూచనలు మాత్రమే ఉండేవి.