హిమాచ‌ల్ ప్ర‌దేశ్ డీజీపీ తొల‌గింపు.. సుప్రీంను ఆశ్ర‌యించిన సంజ‌య్ కుండు

Sanjay Kundu removed as Himachal Pradesh DGP..Supreme Court to hear his plea against removal on Wednesday

షిమ్లా: హిమాచ‌ల్ ప్ర‌దేశ్ డీజీపీ సంజ‌య్ కుండును ఆ ప‌ద‌వి నుంచి తొల‌గించారు. ఆయ‌న్ను ఆయుష్ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియ‌మించారు. అయితే త‌న‌ను బ‌దిలీ చేయాల‌ని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ సంజ‌య్ కుండు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అత్యున్న‌త న్యాయ‌స్థానం రేపు ఆ కేసులో విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ది. కుండు త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది ముఖుల్ రోహ‌త్గీ వాదించ‌నున్నారు. సీజేఐ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, జ‌స్టిస్ మ‌నోజ్ మిశ్రాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించ‌నున్న‌ది. డీజీపీ కుండు వాద‌నల‌ను హైకోర్టు ప‌ట్టించుకోలేద‌ని, ఆ కోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను ప్ర‌భుత్వం పాటించింద‌ని రోహత్గీ అన్నారు.

పాలంపుర్ వ్యాపార‌వేత్త నిషాంత్ శ‌ర్మ వేధింపుల కేసులో విచార‌ణను ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉన్నందున కుండును డీజీపీ హోదా నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు హిమాచ‌ల్ హైకోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది.జ‌న‌వ‌రి 4వ తేదీ లోగా డీజీపీ కుండు, కంగ్రా ఎస్పీ షాలిని అగ్నిహోత్రిని ఇత‌ర పోస్టుల‌కు బ‌దిలీ చేయాల‌ని కోర్టు త‌న తీర్పులో ఆదేశించింది. త‌మ కుటుంబం ప్రాణ భ‌యంతో జీవిస్తోంద‌ని వ్యాపార‌వేత్త నిశాంత్ హైకోర్టుకు మెయిల్ చేశారు. ఈ విష‌యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కోర్టు.. డీజేపీని బ‌దిలీ చేయాల‌ని ఆదేశించింది.