మున్సిపల్‌ కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు మరోసారి విఫలం

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అనేక శాఖల కార్మికులు సమ్మె బాట పట్టడం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే మూడు వారాలుగా అంగన్వాడీ కార్మికులు తమ డిమాండ్స్ ను ప్రభుత్వం నెరవేర్చాలని సమ్మె చేస్తుండగా…వీరి బాటలోనే మున్సిపల్‌ కార్మికలు సైతం గత కొద్దీ రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి చెత్త అక్కడే పేరుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో మున్సిపల్‌ కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు జరుపగా..వారి డిమాండ్స్ కు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో సమ్మె కొనసాగనుంది. కార్మికులకు బేసిక్ పే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఒకవేళ మున్సిపల్ కార్మికులకు బేసిక్ పే చెల్లిస్తే.. ఇతర శాఖల సిబ్బంది సైతం డిమాండ్ చేస్తారని ఏపీ మంత్రులు వారికి వివరించారు. కార్మికుల డిమాండ్లను సీఎం జగన్ కు మరోసారి వివరిస్తామని మంత్రులు పేర్కొన్నారు. తమ డిమాండ్స్ ను నెరవేరిస్తేనే పనుల్లోకి దిగుతామని తేల్చి చెప్పారు.