స్వలింగ వివాహాలపై రాష్ట్రాల అభిప్రాయం కోరిన కేంద్రం

Same-sex marriage: Centre files fresh affidavit in SC, seeks states’ views

న్యూఢిల్లీః సుప్రీంకోర్టు లో మరోసారి స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వాలన్న డిమాండ్‌పై విచారణ జరిగింది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాంత్రాల స్టాండ్‌ ఏంటో తెలుసుకోవాలంటూ కేంద్రం సర్వోన్నత న్యాయస్థానంలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అదే సమయంలో రాష్ట్రాల అభిప్రాయాలను కోరుతూ లేఖలు సైతం రాసింది. స్వలింగ వివాహలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వాలని సీజేఐ డీవై చంద్రచూడ్‌, జస్టిస్ ఎస్‌కే కౌల్, జస్టిస్ ఎస్ఆర్ భట్, జస్టిస్ హిమ కొహ్లీ, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

ఆయా పిటిషన్లపై మంగళవారం విచారణ ప్రారంభం కాగా.. బుధవారం సైతం కొనసాగింది. కేంద్రం తరఫున సొలిజిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహత్‌ వాదనలు వినిపించారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కోసం దాఖలైన పిటిషన్లపై విచారణలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భాగస్వామ్యం కల్పించాలని కోరారు. లేకుంటే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో సంప్రదింపులు జరిపేందుకు కేంద్రానికి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అభిప్రాయాలను స్వీకరించి కోర్టు ముందు ఉంచే వరకు వేచి చూడాలని.. అనంతరమే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం తరఫున కోరారు.

ఇదిలా ఉండగా.. గతంలోనూ రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలని కేంద్రం అభ్యర్థించగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సమానత్వం, గౌరవంగా జీవించే హక్కును కల్పించేందుకు స్వలింగ వివాహాలను గుర్తించాలంటూ సుప్రీంకోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే, దీన్ని కేంద్రం వ్యతిరేకించింది. వ్యక్తిగత చట్టాల సున్నితమైన సమతుల్యత, ఆమోదించిన సామాజిక విలువలను పూర్తిగా దెబ్బతీస్తుందని కేంద్రం అభిప్రాయపడింది. వివాహ వ్యవస్థకు ఒక పవిత్రత ఉందని, దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో దీనిని ఒక సంస్కారంగా, పవిత్ర కలయికగా పరిగణిస్తున్నారని పేర్కొంది. భారత్‌లో పురుషుడు, మహిళ మధ్య వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఉన్నప్పటికీ, వివాహం తప్పనిసరిగా పురాతన ఆచారాలు, ఆచారాలు, సాంస్కృతిక విలువలు, సామాజిక విలువలపై ఆధారపడి ఉంటుందని కేంద్రం తెలిపింది.