టిడిపి మద్దతుదారులకు ఒక్క పథకం ఆగిందని ఎవరైనా చెప్పగలరా?: సజ్జల

జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారు.. సజ్జల

Sajjala Ramakrishna Reddy
Sajjala Ramakrishna Reddy

అమరావతిః ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి విపక్ష నేతలపై ధ్వజమెత్తారు. టిడిపి నేతలు బరితెగించారని, వారికి ఎల్లో మీడియా వంతపాడుతోందని మండిపడ్డారు. టిడిపి తీసుకువచ్చిన 100 పథకాలను మేం నిలిపివేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

2014 నుంచి 2018 మధ్య చంద్రబాబు కనీసం ఒక్క పథకం అయినా పూర్తిగా అమలు చేశారా? అని సజ్జల ప్రశ్నించారు. గతంలో ఉచిత ఇసుక అన్నారు… మరి ఇసుక ఉచితం అయితే నాటి దెందులూరు ఎమ్మెల్యే ఎమ్మార్వో జుట్టు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చిందని నిలదీశారు. ఇసుక ఉచితం అయితే జేసీబీలు పెట్టాల్సిన అవసరం ఏంటి? నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఎందుకు రూ.100 కోట్ల జరిమానా విధించింది? అంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు ఏమైనా పథకాలు తీసుకువస్తే కదా… వాటిని జగన్ ఆపడానికి అంటూ వ్యాఖ్యానించారు. ఏ పార్టీ అని చూడకుండా జగన్ అందరికీ పథకాలు వర్తింపజేస్తున్నారని, టిడిపి మద్దతుదారులకు ఒక్క పథకం ఆగిందని ఎవరైనా చెప్పగలరా? అని సజ్జల సవాల్ విసిరారు. జగన్ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.

ఆఖరికి ఆసుపత్రుల్లో ఓపీలు తగ్గిపోతున్నాయని ఎల్లో మీడియా రాస్తోంది… ఆసుపత్రులు రోగులతో కళకళలాడాలన్నది మీ ఉద్దేశమా? అంటూ సజ్జల ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సిపి సామాజిక సాధికార యాత్రల్లోనూ కుర్చీలు ఖాళీ అంటూ కథనాలు రాస్తారు… సభ అంతా అయిపోయిన తర్వాత ఖాళీ కుర్చీలను ఫొటోలు తీసి ఈ కథనాలు రాస్తుంటారు… పచ్చ పైత్యం పతాకస్థాయికి చేరిందని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అన్నారు.