కాంగ్రెసోళ్లు ఎన్నడన్నా దళితబంధు గురించి ఆలోచించిండ్రా..? : సిఎం కెసిఆర్‌

cm-kcr-speech-in-praja-ashirvada-sabha-at-shadnagar

షాద్‌నగర్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ నేతల మతిలేని మాటలపై మండిపడ్డారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ రైతుల సంక్షేమం కోసం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిందని సిఎం కెసిఆర్‌ చెప్పారు. రైతుకు పెట్టుబడి సాయంగా రైతుబంధు ఇస్తున్నమని, అదృష్టం బాగాలేక రైతు చనిపోతే ఆయన కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమా ఇస్తున్నమని, అంతేగాక రైతులు పండించిన పంటను ప్రభుత్వమే 7,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొంటున్నదని తెలిపారు.

‘తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. కానీ, రైతుబంధు దుబారా కాదు అని మీరంటున్నరు. రైతుబంధు ఉండాలంటున్నరు. మరె రైతుబంధు ఉండాలంటే షాద్‌నగర్‌లో అంజయ్య యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలె. అంజయ్య యాదవ్‌ను గెలిపిస్తే రైతుబంధు ఉండుడే కాదు, ఎకరానికి రూ.10 వేలుగా ఉన్న రైతుబంధును ఎకరానికి రూ.16 వేలు చేస్తనని మాట ఇస్తున్నా. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రైతులకు 24 గంటల కరెంటు అవసరం లేదు. మూడు గంటలు చాలు అంటున్నడు. మరె వ్యవసాయానికి మూడు గంటల కరెంటు సాల్తదా..? చాలదు కాబట్టి 24 గంటల కరెంటు ఉండాలన్నా బిఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్య యాదవ్‌ను గెలిపించాలె. ఎందుకంటే యుద్ధం చేసెటోని చేతుల కత్తి పెడితే ప్రయోజనం గానీ, అవతలోని చేతుల పెడితే లాభం ఉండదు’ అన్నారు.

‘భూముల క్రయవిక్రయాల్లో, భూ రికార్డుల్లో అక్రమాలను గుర్తించి వాటికి అడ్డుకట్ట వేసేందుకు నేను ధరణి పోర్టల్‌ తెచ్చిన. మీరు బొటన వేలు పెడితే తప్ప మీ భూమి మరొకరి పేరు మీద మారే అవకాశం లేకుండా చేసినం. ముఖ్యమంత్రి తల్చుకున్నా మీ భూమిని ఇంకొకరి పేరు మీదకు మార్చలేడు. కానీ కాంగ్రెసోళ్లు ఏమంటున్నరు..? ధరణిని తీస్కపోయి బంగాళాఖాతంలో వేస్తమని అంటున్నరు. అంటే ఏమన్నట్టు..? ధరణిని తీసేసి మళ్ల ఎనకటి దళారీ రాజ్యం తెస్తరన్నట్టు. రైతులు దళారీల చుట్టు తిరిగి, లంచాలు పోసే పరిస్థితి తీసుకొస్తరన్నట్టు. ఇంక మేం గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తమని కాంగ్రెసోళ్లు గొప్పగ చెప్తున్నరు. ఇందిరమ్మ రాజ్యం మనకు తెలువందా..? ఇందిరమ్మ రాజ్యంల ఎన్ని అరాచకాలు జరిగినయ్‌..? ఎంత మందిని కాల్చి చంపిండ్రు..? ఎమర్జెన్సీ పెట్టి ఎంత మందిని జైళ్లల్ల పెట్టిండ్రు..? అసుంటి ఇందిరమ్మ రాజ్యం మళ్ల కావాల్నా..? కాబట్టి ఇయ్యన్నీ మీరు బాగా ఆలోచించాలె’ అని చెప్పారు. “కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం.

‘కాంగ్రెసోళ్లు ఎన్నడన్నా దళితబంధు గురించి ఆలోచించిండ్రా..? మేం దళితబంధు ఇస్తున్నం. ఇప్పటికే కొంతమందికి ఇచ్చినం. ఎన్నికల తర్వాత క్రమంగా దళిత సోదరులందరికీ దళితబంధు వస్తది. ఇంకో విషయం ఏందంటే.. అసైన్డ్ భూములకు పట్టాలిస్తమని మేం చెప్తున్నం‌. కానీ కాంగ్రెసోళ్లు ఉల్టా ప్రచారం చేస్తున్నరు. బిఆర్‌ఎస్‌ మళ్ల అధికాంరలోకి వస్తే అసైన్డ్‌ భూములను గుంజుకుంటదని అంటున్నరు. ఎందుకు గుంజుకుంటం..? ఈ పదేండ్లల్ల గుంజుకున్నమా..? ఇప్పుడు అసైన్డ్‌ భూములను గుంజుకుంటమనే ప్రచారం దేనికి..? అసైన్డ్‌ భూములను గుంజుకునుడు గాదు, ఈ ఎన్నికలు అయిపోంగనే తొలి క్యాబినెట్‌ భేటీలోనే అసైన్డ్‌ భూములకు పట్టాలిచ్చే పని చేస్తమని నేను హామీ ఇస్తున్నా’ అన్నారు.