7వ తేదీ నుండి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్నిప్రారంభిస్తాం: సజ్జల

వలంటీర్ వ్యవస్థ ఆధారంగా.. గృహసారథుల వ్యవస్థను తీసుకొచ్చినట్లు వెల్లడి

sajjala ramakrishna reddy
sajjala ramakrishna reddy

అమరావతిః రాష్ట్రవ్యాప్తంగా 7వ తేదీ నుండి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్‌సిపి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 20 దాకా 14 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ‘జగనన్నే మా భవిష్యత్తు’ పోస్టర్‌ను సజ్జల ఈ రోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో సజ్జల మాట్లాడుతూ.. ‘జగనన్నే మా భవిష్యత్తు’, ‘మా నమ్మకం నువ్వే జగన్’ నినాదాలు ప్రజల నుంచి వచ్చినవని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన నినాదాన్నే కార్యక్రమం పేరుగా నిర్ణయించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అన్ని వర్గాల అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని తెలిపారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్నదే జగన్ లక్ష్యమని అన్నారు. ప్రజలకు జవాబుదారీగా రాజకీయ పార్టీలు ఉండాలని అన్నారు.

14 రోజుల్లో 1.60 కోట్ల కుటుంబాల వద్దకు గృహసారథులు, తమ కార్యకర్తలు వెళ్తున్నారని చెప్పారు. ఆ కుటుంబాలకు వాలంటీర్లలాగే.. వైసీపీ నుంచి గృహసారథులు కూడా ఉంటారని చెప్పారు. జగన్ సంక్షేమ రథానికి అడ్డుపడాలని ప్రతిపక్షాల పేరుతో కొన్ని శక్తులు చేస్తున్న కుట్ర ఈ కార్యక్రమంతో చెక్ పడుతుందని అన్నారు.‘‘ప్రజల అవసరాలను తీర్చడాన్ని బాధ్యతగా భావించే కార్యకర్తలున్న పార్టీగా.. ప్రజల సంతృప్తి రేటును ఎప్పటికప్పుడు అసెస్ చేసుకునే పార్టీగా.. వారి ఆకాంక్షలకు తగినట్లుగా పని చేసే అధ్యక్షుడు ఉన్న పార్టీగా.. గృహసారథుల వ్యవస్థను ప్రారంభించాం’’ అని సజ్జల వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల మంది దాకా కార్యకర్తలు.. ఒక్కొక్కరు 100 మందిని కవర్ చేస్తారని చెప్పారు. వలంటీర్ వ్యవస్థ ఆధారంగా.. గృహసారథుల వ్యవస్థను ప్రారంభించామని తెలిపారు. ‘‘గృహసారథులపైన సచివాలయ కన్వీనర్ల వ్యవస్థ , ఆ పైన మండల ఇన్ చార్జ్ ల వ్యవస్థ, రాష్ట్ర స్థాయిలో జోనల్ కోఆర్డినేటర్లు.. ఉంటారు. మొత్తం యంత్రాంగం కదులుతుంది. ప్రజల్లోకి వెళ్తుంది’’ అని వివరించారు.

‘‘రాజకీయ పార్టీలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజల్లో మమేకమై, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలి. వాళ్ల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. మా లక్ష్యం, గమ్యం అవే’’ అని చెప్పారు. సర్వేలు చేసి తీసుకొచ్చిన వివరాలను బట్టి చూస్తే.. 80 నుంచి 90 శాతం మంది ప్రజలు తమకు మార్పు కనిపిస్తోందని చెప్పారని అన్నారు. తాము పెట్టుకున్న నమ్మకానికి రెండింతలు జగన్ నిలబెట్టుకున్నారని వాళ్లు చెప్పారన్నారు. ‘‘మేం జగన్ ను నమ్ముతున్నాం. మా భవిష్యత్ ఆయనలో కనిపిస్తోంది.. అనే విశ్వాసం ప్రజల్లో కనిపించింది. ఇవన్నీ చూశాక.. ప్రజల నుంచి వచ్చిన నినాదాన్ని.. పార్టీ కార్యక్రమంగా ఎందుకు తీసుకోకూడదని భావించాం’’ అని చెప్పారు.