లోకేశ్ పాదయాత్రకు పోలీసుల అనుమతిని కోరుతాం: అచ్చెన్నాయుడు

యువగళం పేరుతో పాదయాత్రను చేపట్టనున్న లోకేశ్

atchannaidu

అమరావతిః టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 27న కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన లోగోను టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విడుదల చేశారు. అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో యువగళం జెండాను అచ్చెన్నాయుడు ఎగురవేశారు.

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు తాము అడ్డుకోలేదని, ఇప్పుడు నారా లోకేశ్ పాదయాత్రను జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది ఆయన ఖర్మ అని అన్నారు. లోకేశ్ పాదయాత్రకు పోలీసుల అనుమతిని కోరుతామని చెప్పారు. లోకేశ్ అడుగులో అడుగు వేయాలని యువతను కోరుతున్నామని అన్నారు.

కరోనా సమయంలో పరీక్షలు పెట్టి విద్యార్థుల ప్రాణాలు తీసేందుకు జగన్ యత్నించారని అచ్చెన్న ఆరోపించారు. అయితే విద్యార్థుల తరపున నారా లోకేశ్ పోరాడి పిల్లల ప్రాణాలను కాపాడారని చెప్పారు. చాలా కాలం తర్వాత పోలీస్ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ ఇచ్చారని… అయితే చాలా మందికి ఏజ్ బార్ అయిపోయిందని… ఈ అంశంలో ప్రభుత్వంపై లోకేశ్ ఒత్తిడి తీసుకురాగా… ఏజ్ బార్ అయిన వారికి ప్రభుత్వం వెసులుబాటును కల్పించిందని అన్నారు. జగన్ చెప్పే అబద్ధాలను జిల్లా కలెక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి ఖండించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. పెన్షన్ల విషయంలో వాస్తవాలు ఏమిటో కలెక్టర్లు చెపితే ముఖ్యమంత్రికి బుద్ధి వస్తుందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/