నేటి నుంచి “జగనన్నకు చెబుదాం” ప్రారంభం

నేటి నుంచి ఏపీలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు క్రమం తప్పకుండా అప్‌డేట్స్‌ అందించటం ఈ కార్యక్రమం స్పెషాలిటీ. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుకోవడంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులున్నా, వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక అందుకోవడంలో సమస్యలు ఉన్నా, రేషన్‌ కార్డు వంటివి పొందడంలో అవాంతరాలు ఎదురైనా, రైతన్నలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, ఎవరికైనా ప్రభుత్వ సేవలు పొందడంలో అవాంతరాలు ఎదురైనా నేరుగా ముఖ్యమంత్రికి కార్యాలయానికి ఫిర్యాదు చేయొచ్చు.

వీటితో పాటు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ సేవలు అందుకోవడంలో ఏమైనా సమస్యలున్నా రెవెన్యూ రికార్డులకు సంబంధించి సమస్యలున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి వ్యక్తిగత ఇబ్బందులున్నా, ప్రభుత్వ సేవలకు సంబంధించి ఏ సమస్య పరిష్కారానికైనా జగనన్నకు చెబుదాం – 1902కు ఫిర్యాదు చేయవచ్చు.

ఈ కార్యక్రమంపై ఇప్పటికే సీఎం జగన్ అధికారులతో సమీక్షలు చేశారు. జగనన్నకు చెబుదాం పేరులో ముఖ్యమంత్రి జగన్ పేరును కలపి నిర్వహించే కార్యక్రమం ద్వారా సీరియస్ నెస్ ను పెంచేందుకు ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ కార్యక్రమానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎంటనేది ఇప్పటికే జిల్లా స్థాయిలోని అధికారులకు కూడా స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చారు.