అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుందుః సజ్జల
అన్యాయమైన డిమాండ్ ను కోర్టు కొట్టిపారేసిందని వ్యాఖ్యలు

అమరావతిః అమరావతిలోని ఆర్5 జోన్ లో స్థానికేతరులకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు వీలు కల్పించే జీవో నెం.45ను వ్యతిరేకిస్తూ రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, రైతుల పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు తిరస్కరించడం తెలిసిందే. ఈ జీవోపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. కోర్టు తీర్పు అనుసరించి ఇళ్ల పట్టాల పంపిణీ జరగాలని స్పష్టం చేసింది.
దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇది తమకు విజయం అని ప్రభుత్వం భావించడం లేదని స్పష్టం చేశారు. అడ్డంకులు సృష్టించే ప్రయత్నాన్ని కోర్టు అడ్డుకుందని తెలిపారు. అన్యాయమైన ఒక డిమాండ్ ను కోర్టు కొట్టిపారేసిందని అన్నారు. రాజకీయ దురుద్దేశాలతో అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ రాజధాని అంటే ప్రజలు అందరూ ఉండే ప్రాంతం అని సజ్జల వివరించారు.