బాలాపూర్ లడ్డుకు రికార్డు ధర..

మరోసారి బాలాపూర్ లడ్డు రికార్డు ధర పలికింది. గణేష్ నవరాత్రులు…నిమజ్జనం వేళ బాలాపూర్ లడ్డుకు ఉన్న ప్రత్యేకత వేరు. ప్రతీ ఏటా నిమజ్జనం ముందు నిర్వహించే వేలం పాటను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. గతేడాది(2022) వేలంలో ఈ లడ్డూ రూ.24.60 పలకగా.. ఈసారి కొత్త రికార్డు సొంతం చేసుకుంది. ఈ రోజు హోరాహోరీగా సాగిన వేలంలో లడ్డూను రూ.27 లక్షలకు దక్కించుకున్నారు దాసరి దయానంద్ రెడ్డి . ఈ వేలం పాటలో మొత్తం 36 మంది పాల్గొన్నారు.

గతేడాది లడ్డూ ధర 24.60 లక్షలు పలికింది. లాస్ట్ టైమ్ మిస్ అయిన వాళ్ళు కూడా ఈ సారి వేలం పాటలో పాల్గొన్నారు. బాలాపూర్ లడ్డూ మొదటి నుంచి చాలా ఫేమస్. ఇక్కడ లడ్డూను పాడుకోవడానికి పోటీలు పడుతుంటారు. ఈసారి కూడా వేలం మొదలైన దగ్గర నుంచి ఆసక్తి నెలకొల్పింది. మొదటి నుంచే లడ్డూ ధర అరకోటి టచ్ అవుతుందని అంచనా ఉంది. కానీ పాట 27 లక్షల దగ్గరనే ఆగిపోయింది.

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం లో బాలాపూర్ గ్రామంలో ప్రతి ఏడాది వినాయక చవితి కి వినాయకుడి లడ్డును వేలం వేస్తారు. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో ఈ లడ్డును అత్యధికంగా వేలం పాట పడి దక్కించుకుంటారు. దీనితో బాలాపూర్ లడ్డు ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకుంది. బాలాపూర్ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలసివస్తుందని భక్తులకు నమ్మకంగా మారింది.

బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి 1980లో ఏర్పాటైంది. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. తొలిసారి జరిగిన వేలంపాటలో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి కుటంబం రూ.450 దక్కించుకున్నాడు. ఆ లడ్డును ఆయన పొలంలో చల్లాడు ఆ ఏడాది ఆర్థికంగా ఆయనకు కలిసిరావండంతో, 1995లో రూ. 4500 లకు మరోసారి వేలంపాటలో లడ్డును దక్కించుకున్నాడు. ఆయనకు లడ్డు వేలం బాగా కల్సివచ్చింది. దీనితో లడ్డు ఎంతో మహిమలు కలదని, అంత మంచే జరుగుతుందనే నమ్మకంతో బాలాపూర్ లడ్డుకి భక్తుల్లో నమ్మకం పెరిగింది. ప్రతి ఏడాది వందల నుండి వేలు, వేలు నుండి లక్షలకు లడ్డు వేలంపాట చేరుకుంది. బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వారి ఇంట్లో సిరిసంపదలు విరజిల్లుతాయని.. పసిడి పంటలు పండుతాయని భక్తుల్లో విశ్వాసం పెరిగింది.