లారియస్‌ అవార్డు రేసులో సచిన్‌

నామినేట్‌ అయిన టీమిండియా ఆటగాళ్లు సచిన్‌ను భుజాలపై మోసిన క్షణం

Team India
Team India

లండన్: టీమిండియా ప్రపంచకప్‌ గెలిచాక సచిన్‌ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని వాంఖడే మైదానమంతా తిప్పిన దృశ్యం ప్రతిష్ఠాత్మక లారియస్‌ అవార్డుకు నామినేటైంది. ఏప్రిల్‌ 2, 2011న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 28 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్‌ను అందుకోవడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులకు ప్రత్యేక క్షణంగా నిలిచింది. ముఖ్యంగా సీనియర్‌ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌కు అది మరింత ప్రత్యేకం. ఎందుకంటే అప్పటికి ఆరుసార్లు మెగా టోర్నీలో పాల్గొన్నా నిరాశే ఎదురైంది కాబట్టి. 2000 నుంచి 2020 మధ్య క్రీడల్లో అత్యుత్తమంగా నిలిచిన 20 ఘటనలను నిర్వాహకులు నామినేట్‌ చేశారు. టీమిండియా గెలిచిన ఆ క్షణాన్ని మొత్తం దేశాభిమానుల ఆనందం కోణంలో లారెస్‌ ‘క్యారీడ్‌ ఆన్‌ ద షోల్డర్స్‌ ఆఫ్‌ ఎ నేషన్‌’ అని టైటిల్‌ పెట్టింది. లారియస్‌ అవార్డు కోసం 20మంది పోటీలో ఉండగా.. సచిన్‌ కూడా రేసులో నిలిచాడు. ఈ విషయాన్ని లారియస్‌ అకాడమీ సభ్యుడు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ వా ప్రకటించాడు. ‘క్రికెట్‌లో అదో అద్భుతమైన సందర్భం. భారత్‌ సాధించిన గొప్ప విజయం’ అని వా పేర్కొన్నాడు. ఆన్‌లైన్‌లో మూడు నాకౌట్‌ రౌండ్‌ల ఓటింగ్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఈనెల 10న ప్రారంభమైన ఆన్‌లైన్‌ ఓటింగ్‌.. ఫిబ్రవరి 16న ముగుస్తుంది. తుది విజేతను ఫిబ్రవరి 17న బెర్లిన్‌ (జర్మనీ)లో జరిగే కార్యక్రమంలో ప్రకటిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/