లారెస్‌ టాప్‌ 5లో 2011 ఫైనల్‌ సంబరం

సచిన్‌ టెండుల్కర్‌కు అది ప్రత్యేకం

Team India
Team India

న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక లారెస్‌ స్పోర్ట్స్‌ మూమెంట్‌ 2000-2020 అవార్డు రేసులో తుది ఐదుగురి జాబితాలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌కు చోటుదక్కింది. దీంతో లారెస్‌ అవార్డు అందుకునే దిశగా సచిన్‌ ‘2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ సంబర ఘట్టం’ మరో అడుగు ముందుకు వేసింది. ఫిబ్రవరి 16న ఓటింగ్‌ ముగిశాక బెర్లిన్‌లో జరిగే కార్యక్రమంలో విజేతను 17న ప్రకటిస్తారు. గత ఇరవై ఏళ్లలో క్రీడా చరిత్రలో మధురమైన ఘట్టాలకు సంబంధించి లారెస్‌ ఫౌండేషన్‌ ఈ పోటీ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ముంబై వాంఖడే మైదానంలో ఫైనల్‌ గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లు సచిన్‌ను తమ భుజాలపై మోసిన దృశ్యం అవార్డు కోసం పోటీ పడుతుంది. ఇప్పటి వరకు 20 ఎంట్రీలు అవార్డు రేసులో ఉండగా.. వాటిని ఐదుకు కుదించారు. ఈ టాప్‌5లో సచిన్‌ సంబరానికి చోటు దక్కింది. ‘క్యారీడ్‌ ఆన్‌ ద షోల్డర్స్‌ ఆఫ్‌ ఎ నేషన్‌’ అనే టైటిల్‌తో అప్పటి మధుర క్షణం అవార్డు బరిలో నిలిచింది.
ఏప్రిల్‌ 2, 2011న మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సారథ్యంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 28 ఏళ్ల తర్వాత టీమిండియా ప్రపంచకప్‌ను అందుకోవడంతో ఆటగాళ్లతో పాటు అభిమానులకు ప్రత్యేక క్షణంగా నిలిచింది. ముఖ్యంగా సీనియర్‌ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌కు అది మరింత ప్రత్యేకం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/