నిరాహారదీక్షకు సిద్ధమైన సచిన్ పైలట్

దీక్ష చేయొద్దంటూ కాంగ్రెస్ పార్టీ వార్నింగ్

Sachin Pilot to hold fast against corruption, Congress calls it ‘anti-party’

జైపూర్ః రాజస్థాన్ లో గత పాలకుల హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తో కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. మంగళవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తానంటూ పైలట్ ముందే ప్రకటించారు. సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేయడమేంటని పార్టీ ప్రశ్నించినా పైలట్ వినిపించుకోలేదు. దీక్ష చేస్తే పార్టీ వ్యతిరేక పనులకు పాల్పడినట్లేనని, చర్యలు తప్పవని హెచ్చరించినా లెక్క చేయలేదు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎవరూ కూడా ఆయనతో కలిసి వచ్చే పరిస్థితి లేదని సమాచారం. అయినప్పటికీ నిరసన చేపట్టేందుకే పైలట్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

దీక్ష ఎందుకు చేస్తున్నారంటే..

బిజెపి పాలనలో రాష్ట్రంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నది పైలట్ ప్రధాన డిమాండ్. అప్పట్లో చాలామంది బిజెపి నేతలపై అవినీతి ఆరోపణలు వినిపించాయి. అయితే, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ఆరోపణలపై విచారణ జరిపించలేదు. జైపూర్ లోని షహీద్ స్మారకం వద్ద పైలట్ చేపట్టబోయే దీక్షకు హాజరయ్యేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు సుముఖంగా లేరు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పైలట్ మద్దతుదారులు దీక్షాస్థలికి చేరుకుంటున్నారు. నిరసన దీక్షను పార్టీ వ్యతిరేక కార్యక్రమంగానే గుర్తిస్తామని, దీక్ష చేస్తే కఠిన చర్యలు తప్పవని సచిన్ పైలట్ ను ఏఐసీసీ ఇన్ చార్జ్ సుఖ్ జిందర్ సింగ్ రంధావా హెచ్చరించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే పార్టీ వేదికలపై చర్చించాలని రంధావా సూచించారు. అంతేకాని ఇలా రోడ్డెక్కడం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన ఐదు నెలలుగా రాజస్థాన్ కు ఏఐసీసీ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నానని, ఇప్పటి వరకూ ఏ అంశాన్ని కూడా పైలట్ తన దృష్టికి తీసుకురాలేదని రంధావా చెప్పారు. దీక్ష సందర్భంగా పైలట్ మౌన వ్రతం పాటిస్తారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడబోరని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. గెహ్లాట్ సర్కారు అవినీతిపై చర్యలు తీసుకోలేదనే ఆరోపణ నిజం కాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. సంజీవని స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిజెపి సీనియర్ లీడర్ గజేంద్ర సింగ్ షెకావత్ పై విచారణ కొనసాగుతోందని గుర్తుచేశారు.