తెరచుకున్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఈ ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు, కేరళ దేవస్వొం బోర్డు అధికారులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి మణికంఠుడి ఆలయం తలుపులను తెరిచారు. స్వామివారి దర్శనం కోసం భక్తులకు అనుమతి ఇస్తున్నారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తోన్నారు. పూజ కార్యక్రమాలు పూర్తి చేసి బుధవారం రాత్రి 9 గంటలకు ఆలయాన్ని మూసేయనున్నారు. తిరిగి నవంబర్ 15న అయ్యప్ప గుడి తెరుచుకోనుంది. అప్పటి నుంచి రెండు నెలల వరకు ఆలయం తెరిచే ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు టీకా ధ్రువీకరణ పత్రాన్ని తప్పక సమర్పించాలి. లేదంటే 72 గంటల్లోపు తీసిన కొవిడ్ నెగెటివ్ రిపోర్టును అందించాలి.

శబరిమలకు వెళ్లే మార్గంలో ఉన్న నీలక్కళ్ వద్ద అధికారులు ప్రత్యేకంగా కోవిడ్ 19 పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయిదు అత్యవసర వైద్య చికిత్స కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి వైద్య చికిత్స అవసరమైన ఈ కేంద్రాల ద్వారా అందిస్తారు. దీనితోపాటు పంప నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలోనూ అత్యవసర వైద్య చికిత్స, ఆక్సిజన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రథమ చికిత్సను అందించడం, బ్లడ్ ప్రెషర్‌ను చెక్ చేయడం, గుండెపోటుకు గురయ్యే వారి కోసం ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నరల్ డీఫైబ్రిలేటర్‌ సౌకర్యాలను కల్పించారు.