ప్రధాని సభలోకి వస్తే ఏమవుతుంది..ఆయన పరమాత్ముడా?: ఖర్గే

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో ఖర్గే మాట్లాడుతుండగా పాలక పక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించడంతో ఓ దశలో ఖర్గే సహనం కోల్పోయారు. సభ్యులు అదే పనిగా నినాదాలు చేస్తుండటంతో ఆయన ఒకింత ఆగ్రహానికి లోనయ్యారు.
ప్రధాని సభలోకి వస్తే ఏమవుతుంది..ఆయన ఏమైనా దేవుడా..ఆయన పరమాత్ముడు కాదని ఖర్గే వ్యాఖ్యానించారు. కాగా అవిశ్వాస తీర్మానంపై రెండు రోజులుగా సాగిన చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సమాధానం ఇవ్వనున్నారు. మణిపూర్ హింసాకాండపై మోడీ సర్కార్‌ను దోషిగా నిలబెట్టే ఉద్దేశంతో విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.
అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో విపక్ష నేతలు మోడీ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. మణిపూర్‌లో భారత మాతను బిజెపి హత్య చేసిందని, డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్వాకం ఇదేనని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. రెండు నెలలుగా మణిపూర్ భగ్గుమంటే ప్రధాని మోడీ కనీసం రాష్ట్రాన్ని సందర్శించలేదని దుయ్యబట్టారు.