రాధే శ్యామ్ ట్రైలర్ ఎలా ఉందో తెలుసా..?

పాన్ స్టార్ ప్రభాస్ నటించిన పాన్ మూవీ రాధే శ్యామ్. 1970ల నాటి ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో పలు భాషల్లో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్లు.. సినిమాపై ఆత్రుతను పెంచాయి. ఈ మూవీ లో ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్​గా నటించగా. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించారు. ఇక సినిమా ప్రమోషన్ లో భాగంగా గురువారం చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను రామోజీఫిల్మ్ సిటీ లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అభిమానుల చేతుల మీదుగా ‘రాధేశ్యామ్’ ట్రైలర్​ను విడుదల చేసారు.

ట్రైలర్ విషయానికి వస్తే..’అమ్మ పెళ్లి గురించి అడిగితే చెప్పు.. నా చేతిలో ప్రేమ పెళ్లి లేవు’ అని చెప్పడంలో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ప్రేమ పెళ్లి అనే వాటికి తావు లేకుండా కనిపించిన అమ్మాయిని ఫ్లర్ట్ చేసే యువకుడిగా ప్రభాస్ కనిపించాడు. ఈ క్రమంలో అతని జీవితంలోకి పుజా హెగ్డే (ప్రేరణ) వస్తుంది. ‘నేను ప్రేమలో పడను.. అలాంటి ప్రేమ నా వల్ల కాదు..’ అంటూ ఆమెను ముద్దుల వరకూ తీసుకొచ్చాడు.

అదే సమయంలో ప్రపంచ దేశ నాయకులందరూ కలవాలనుకునే గొప్ప హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్యగా.. పామిస్ట్రీకి ఐన్ స్టీన్ ప్రభాస్ ను పరిచయం చేసారు. ‘పుట్టుక నుంచి చావు దాకా.. ఏ రోజు ఏమి జరుగుతుందో నాకు బాగా తెలుసు’ అంటూ తన పాత్ర స్వభావాన్ని తెలియజేసారు.

‘ప్రపంచం మొత్తాన్ని చదివేసిన నువ్వు నన్నెంత చదవ గలవో చూస్తాను’ అంటూ ప్రేరణ తన చేయి అందించింది. దీనికి ‘కాలం రాసిన చందమామ కథలా నీ ప్రేమకథ ఉంటుంది.. నీ ప్రేమ ఎదురవడం వరం కాని దాన్ని అందుకోవడం మాత్రం యుద్ధం’ అని ప్రభాస్ చెప్పడం ఆసక్తిని కలిగిస్తోంది. ‘విధిని ఎదిరించి ప్రేమ గెలవగలదా? మన రాతే ఇంత పెద్ద భూకంపాన్ని సృష్టించిందా? ప్రాణం పోసిన ప్రేమే ప్రాణాలు తీస్తుందా?’ అని ప్రభాస్ చెప్పే డైలాగ్ ‘రాధే శ్యామ్’ సినిమా నేపథ్యాన్ని తెలియజేస్తోంది. విక్రమాదిత్య – ప్రేరణలు విధిని ఎదిరించి ఒకటయ్యారా లేదా? వీరి ప్రేమకథ చివరకు ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథగా తెలుస్తోంది. ట్రైలర్ బట్టి చూస్తే సినిమాలో చాల ట్విస్ట్ లు ఉన్నట్లు అర్ధమవుతుంది.

పరమహంస పాత్రలో కృష్ణంరాజు కనిపిస్తుండగా.. భాగ్యశ్రీ , జగపతిబాబు , ప్రియదర్శి , సత్యరాజ్ , కునాల్ రాయ్ కపూర్ , సచిన్ ఖేడ్కర్ , మురళి శర్మ , ఎయిర్ టెల్ శాషా ఛత్రి , రిద్ది కుమార్ , సత్యన్ ఇతర పాత్రలు పోషించారు.