శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ బస్ బోల్తా : 21మందికి గాయాలు

శ్రీకాకుళం జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌ చేతిలోని స్టీరింగ్‌ ఒక్కసారిగా విరగడం తో బస్సు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 21 మంది గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే..

శ్రీకాకుళం నుంచి పాతపట్నం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నరసన్నపేట సమీపంలో జాతీయ రహదారిపై కోమర్తి జంక్షన్‌ దగ్గరకు చేరుకోగానే డ్రైవర్‌ చేతిలోని స్టీరింగ్‌ ఒక్కసారిగా విరిగిపోయింది. దీంతో బస్సు అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌, కండక్టర్‌తోపాటు 19 మంది ప్రయాణికులకు గాయపడ్డాయి. ప్రమాదం తెలుసుకున్న పోలీసులు..స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా బస్సు బోల్తా పడటంతో ఆ మార్గంలో వచ్చే ఇతర వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. హైవేపై బారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆ ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. స్టీరింగ్ విరగడానికి కారణాలపై ఆర్టీసీ అధికారులు ఆరా తీస్తున్నారు.