ఝార్ఖండ్‌లో తృటిలో తప్పిన మరో రైలు ప్రమాదం

ఒడిశా రైలు ప్రమాదం తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాలంటే భయపడుతున్నారు. ఒకరు కాదు , ఇద్దరు కాదు ఈ ప్రమాదంలో ఏకంగా 270 మందికి పైగా మృతి చెందారు. ఈ ప్రమాదం తర్వాత కూడా పలు రైళ్ల ప్రమాదాలు తృటిలో తప్పడం ప్రయాణికులను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.

తాజాగా లోకోపైలట్ అప్రమత్తతో మరో రైలు ప్రమాదం తృటిలో తప్పిన ఘటన ఝార్ఖండ్‌లో సంతాల్‌ధీ రైల్వే క్రాసింగ్ వద్ద చోటుచేసుకుంది. రేల్వే గేటును ట్రాక్టర్ ఢీకొనడాన్ని గమనించిన ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ లోకో పైలట్ వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే అధికారి ఒకరు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు 45 నిమిషాలు పాటు అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ట్రాక్టర్‌ను జప్తు చేసి కేసు నమోదు చేసుకున్నామని అధికారులు వెల్లడించారు.

అలాగే మంగళవారం రాత్రి కాచిగూడ నుంచి బెంగళూరుకు బయల్దేరిన ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ రైల్వేస్టేషన్ వద్ద సడెన్ బ్రేక్ వేయడంతో రైలు చక్రాల్లో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను ఆర్పి వేశారు. దీంతో ప్రమాదం తప్పింది. 15 నిమిషాల తర్వాత రైలు బెంగళూరుకు బయల్దేరింది. ఇలా వరుస ప్రమాదాలు అందర్నీ ఖంగారుకు గురిచేస్తున్నాయి.