కొడాలి నాని మాట్లాడే భాషకు రోజా సపోర్ట్..ఆయనపై ఈగ వాలితే సహించేది లేదని వార్నింగ్

కొడాలి నాని మాట్లాడే భాషలో తప్పేముందని.. ఆయనపై ఈగ వాలితే సహించేది లేదని మంత్రి రోజా హెచ్చరించారు. గురువారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలుకాగానే. జాబ్ క్యాలెండర్.. జాబ్ లెస్ క్యాలెండర్ అయిందనే తీర్మానంపై చర్చించాలని టీడీపీ సభ్యులు స్పీకర్ ను పట్టుబట్టారు. ఈ తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్… ప్రశ్నోత్తరాల తర్వాత చర్చను చేపడదామని చెప్పారు. దీంతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో పది నిముషాలు వాయిదా వేశారు.

ఈ సమయంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోజా మాట్లాడుతూ టీడీపీ నేతల తీరు ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని … బాబు వస్తే జాబు వస్తుందని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి టీడీపీ మోసం చేసిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాలనే చిత్తశుద్ధి టీడీపీ నేతలకు లేదని… వారికి రాజకీయాలే ముఖ్యమని అన్నారు. టీడీపీ గ్రామాల్లో తిరిగితే ఎంత మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయో తెలుస్తుందన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన డీఎస్ఈని ..జగనే ఇచ్చారని రోజా అన్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని అన్నారు. జాబ్ క్యాలెండర్ లో భాగంగా 10,143 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయాన్ని తెలుసుకోవాలని అన్నారు.

మూడు రాజధానుల బిల్ పెట్టే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని టీడీఎల్పీ సమావేశంలో చర్చించారని.. ప్రజల మద్దతు ఉండబట్టే మూడు రాజధానుల విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావన చేస్తోందని, అందుకే రాజధాని ప్రాంతం సహా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఎన్నికల్లో వైస్సార్సీపీ విజయం సాధించిందన్నారు. చంద్రబాబు వెనుక ఎంతమంది ఎమ్మల్యేలు ఉన్నారో తెలుసా? అని రోజా ప్రశ్నించారు. మూడు రాజధానుల ప్రస్తావన వస్తే వైస్సార్సీపీ ఎమ్మల్యేలు ఎందుకు రాజీనామా చేయాలన్నారు. రాంగ్ రూట్‌లో ఎమ్మెల్సీ అయిన లోకేష్ సీఎం జగన్‌ పై అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలతో కొట్టిస్తామన్నారు.

మాజీ మంత్రి కొడాలినాని భాషలో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. ఆయనపై ఈగ వాలితే సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ రౌడీయీజం చేస్తూ ఇళ్ళపై దాడి చేస్తారా? అంటూ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా మీము సిద్ధంగా ఉన్నామని రోజా అన్నారు.