దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటలపై నిషేధంః మద్రాస్ హైకోర్టు

దసరా ఉత్సవాలే కాకుండా ఆలయ ఉత్సవాల్లోనూ ఇలాంటివి ఉండకూడదంటూ హైకోర్టు ఆదేశం

Madras High Court

చెన్నైః దసరా ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతాయి. అయితే దసరా ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు, సినిమా పాటలను మద్రాస్ హైకోర్టులోని మధురై ధర్మాసనం నిషేధించింది. పవిత్ర ఉత్సవాల్లో భక్తి గీతాలకే పెద్దపీట వేయాలని ఆదేశించింది. తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడి ముత్తాలమ్మన్ ఆలయంలో నిర్వహించే నవరాత్రుల సందర్భంగా అశ్లీల నృత్యాల ప్రదర్శనలు, సినిమా పాటలు హోరెత్తుతూ ఉంటాయి. ఉత్సవాల పేరిట జరుగుతున్న ఈ అశ్లీల నృత్యాలను ఆపాలంటూ సామాజిక కార్యకర్త రాంకుమార్ ఆదిత్యన్ హైకోర్టును ఆశ్రయించారు.

జస్టిస్ మహాదేవన్, జస్టిస్ సత్యనారాయణ ప్రసాద్‌లతో కూడిన బెంచ్ నిన్న ఈ పిటిషన్‌ను విచారించింది. వాదనల అనంతరం ఒక్క దసరా ఉత్సవాల్లోనే కాకుండా ఇకపై ఏ ఆలయ వేడుకల్లోనూ అశ్లీల నృత్యాలు, సినిమా పాటలు పెట్టకూడదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/