నేడు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. దసరా సందర్బంగా ఈరోజు మధ్యాహ్నం జాతీయ పార్టీ ని ప్రకటించబోతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ప్రస్థానంలో కీలక ముందడుగు పడనుంది. 8 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న టిఆర్ఎస్ ఇప్పుడు జాతీయ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతుంది. కొత్త జాతీయ పార్టీ.. జాతికి అనివార్యం అనే నినాదంతో టిఆర్ఎస్ ను భారత రాష్ట్ర సమితి (BRS) గా మారుస్తూ కొత్త పార్టీ ఎజెండాను పార్టీ అధినేత సీఎం కేసీఆర్ నేడు మధ్యాహ్నం 1.19 గంటలకు ప్రకటించనున్నారు. కేసీఆర్ ప్రకటన ఫై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కేసీఆర్‌ జాతీయ పార్టీని స్వాగతిస్తూ పలు రాష్ర్టాల్లో పోస్టర్లు వెలిశాయి. పలు జాతీయ చానళ్లు ఈ పరిణామంపై ఆసక్తికరమైన కథనాలు ప్రసారం చేస్తున్నాయి. కొన్ని చానళ్లు కౌంట్‌డౌన్‌ కూడా నిర్వహిస్తున్నాయి. జాతీయ పార్టీ ప్రకటన.. అనంతర పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. సామాజిక మాధ్యమాల్లోనూ పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు.

తెలంగాణ ఆత్మగౌరవం.. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 2001లో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించింది. ఇప్పుడు దేశ హితం కోసం కేసీఆర్‌ పిడికిలి బిగిస్తున్నరు. కాకతాళీయమో..కాలమహిమో అప్పుడూ ఇప్పుడూ రెండు సందర్భాల్లోనూ కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉన్నది. నాడు ప్రధానిగా బీజేపీ అగ్రనేత వాజ్‌పేయి ఉండగా.. నేడు ప్రధానిగా మోదీ ఉన్నారు. 2001లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఏర్పడినప్పుడు రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు రాజకీయ బలం లేదు. పైగా టీఆర్‌ఎస్‌ ఉపప్రాంతీయ పార్టీగా తెలంగాణ గడ్డపై ఉద్భవించింది. ఈ పార్టీని ‘మఖలో పుట్టి.. పుబ్బలో మాయం’ అవుతుందన్నారు. కానీ తెలంగాణను సాధించి అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలిపారు. నేడు జాతి హితం కోసం తెలంగాణే మాడల్‌గా, తెలంగాణే స్ఫూర్తిగా విజయదశమి పర్వదినం నాడు శంఖారావం చేస్తున్నారు.

ఈ కార్యక్రమానికి కర్ణాటక నుంచి జెడిఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. తమిళనాడు నుంచి విదుతలై చిరుతైగల్ కచ్చి (VSK) వ్యవస్థాపక అధ్యక్షుడు, చిదంబరం ఎంపీ తిరుమావళవన్, ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావు, కొందరు జాతీయ రైతు సంఘం ప్రతినిధులు నగరానికి రావడం జరిగింది.