తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు

తిరుపతి-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తిరుపతి నుంచి గుంటూరు వెళ్తున్న ట్రైన్ శుక్రవారం రాత్రి తిరుపతిలో 7.30 గంటలకు స్టార్ట్ అవ్వాల్సింది.. కానీ ఓ గంట ఆలస్యంగా స్టార్ట్ అయ్యింది. అలా కడప జిల్లా కమలాపురం రైలు నిలయం దాటిన తర్వాత ఓ సిమెంటు పరిశ్రమ సమీపంలో అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో ఆగింది. రైలు ఆగిన తర్వాత 20 నుంచి 25 మంది వరకు దొంగలు ట్రైన్ లోకి ఎక్కి..ఎస్‌1 నుంచి ఎస్‌6 వరకు ఉన్న బోగీల్లో కిటికీల పక్కన ప్రయాణికులను టార్గెట్ చేశారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల బంగారు ఆభరణాలు లాక్కుని పారిపోయారు. రైల్లో కొందరు ప్రయాణికులు ప్రతిఘటించే యత్నం చేయగా వారిపై దుండగులు దాడులు చేశారు.

ఎస్‌3 బోగీలో నలుగురు మహిళల బంగారు ఆభరణాలు లాక్కెళ్లేందుకు దుండగులు ప్రయత్నించగా.. ముగ్గురు ప్రతిఘటించినట్లు చెబుతున్నారు. దీంతో ఒకరి మెడలో మాత్రం బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు తెలిపారు. రైలు ఎర్రగుంట్ల రైలు నిలయానికి చేరుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ప్రొద్దుటూరులో పోలీసులు బోగీల్లో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైలుకు గస్తీ నిర్వహించాల్సిన పోలీసులు తిరుపతి నుంచి ఎర్రగుంట్ల వరకు ఎవరూ ఉండరని.. ఎర్రగుంట్ల నుంచి గుంటూరు వరకు పోలీసు భద్రత ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వ్యక్తులే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.