మహారాష్ట్రలో బోణీ కొట్టిన బీఆర్ఎస్..

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ బోణి కొట్టింది. మహారాష్ట్రలో ఓ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో ఇటీవలే ఆ పార్టీలో చేరిన అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శిక్షణ శిబిరం ప్రారంభమైన తొలి రోజే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి.

ఔరంగబాద్‌ జిల్లా గంగాపూర్‌ తాలూకా అంబేలోహల్‌ గ్రామంలో ఒకటో నంబర్‌ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థి సర్దార్‌ గఫూర్‌ పఠాన్‌ 115 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. గఫూర్‌ పఠాన్‌ ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నిక ఫలితం శుక్రవారం ఉదయమే వెలువడింది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ నాందేడ్‌కు చేరుకున్న సమయంలోనే ఫలితం వెలువడటం యాదృచ్ఛికం. బీఆర్‌ఎస్‌ విజయం స్థానికంగా చర్చనీయాంశమైంది.