పార్లమెంట్ భవనంలో దాడిపై కేంద్ర హోంమంత్రి నుంచి సమాధానం లేదుః భట్టి విమర్శ

పార్లమెంట్‌లో ఎంపీల సస్పెన్షన్… ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న మల్లు భట్టి

హైదరాబాద్ః పార్లమెంట్‌లో జరిగిన ఘటనపై హోంమంత్రి అమిత్ షా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం రాలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంటులో విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద I.N.D.I.A. కూటమి చేపట్టిన ధర్నాలో మల్లు భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎంతోమంది త్యాగాల ఫలితం వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. కానీ ప్రస్తుతం దేశంలో అరాచక పాలన సాగుతోందన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైనా ఉందన్నారు. నియంతృత్వ పోకడలతో నరేంద్రమోడీ పాలన కొనసాగుతోందన్నారు.

దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని.. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన ప్రతివారినీ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. పార్లమెంట్ భవనంలో దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. పార్లమెంటును రక్షించలేని బిజెపి.. దేశ రక్షణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు.