వేర్వేరు రోడ్డు ప్రమాదంలో.. 13మంది మృతి

ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 23 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. ఛత్తీస్​గఢ్​లోని బెమెతర జిల్లాలోని తిరయ్య గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లిన బాధితులు ఆదివారం రాత్రి తిరుగుపయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న మినీ ట్రక్కును కథియా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన డ్రైవర్ ఆపారు. ఇంతలో ఓ సరకు వాహనం వచ్చి మినీ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే తొమ్మిది మంది మరణించారు. 23 మంది గాయపడ్డారు. మృతులను పాతర్రా గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇక ఏపీలోని కోనసీమ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. యానాం లో పుట్టిన రోజు వేడుకల పార్టీ చేసుకుని తిరిగి వస్తుండగా అమలాపురంలోని భట్నవిల్లి దగ్గర ఈ ప్రమాదం జరిగింది. మృతులను నవీన్(22), జతిన్(26), నల్లి నవీన్(27), అజయ్(18)గా గుర్తించారు. మృతులు మామిడికుదురు మండలం నగరం వాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఆటోను వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.